Mana Enadu: తెలగాణ(Telangana)లో పార్టీ మారిన MLAల అనర్హతపై హైకోర్టు(High Court)లో సోమవారం (SEP 09) విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. దీంతోపాటు పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలంది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే కేసును సుమోటోగా తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని BRS, BJP నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈమేరకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, KTR పిటిషన్ వేశారు. మరోవైపు దానంపై అనర్హత(disqualification petition) వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘సుప్రీం’ ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడంలేదు: BRS, BJP
BRS, BJP వేసిన అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు(High Court) విచారణ జరిపింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఉన్నత న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపు అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. లేకపోతే తామే సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ BRS తరఫున పోటీ చేసి ఖైరతాబాద్ MLAగా విజయం సాధించారు. కడియం శ్రీహరి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలుపొందారు. తెల్లం వెంకట్రావ్ భద్రాచలం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు.MP ఎన్నికల ముందు వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై BRS అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాడుతోంది. కాగా తాజా ఆదేశాలతో.. స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: హరీశ్ రావు
MLAల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తప్పదన్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.