Mana Enadu : తెలంగాణలో మళ్లీ వర్షాలు(Telangana Rains) షురూ అయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. చక్రవాతపు ఆవర్తనం ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Rains) అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించారు.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ ప్రభావంతో మంగళవారం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రోజున ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్(Rain Yellow Alert) ను జారీ చేశారు.
హైదరాబాద్ లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో, ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం(Hyderabad Rains Today) పడుతోంది. మేడ్చల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్, దుండిగల్, వికారాబాద్ జిల్లాలోని తాండూరు, బహదూర్‌పల్లి, సూరారం, గుండ్ల పోచంపల్లి, కూకట్పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఖైరతాబాద్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, పటాన్చెరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు రానున్న మూడు రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.