Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్(AP Budget 2024)కు వేళయింది. నవంబర్ 11వ తేదీన శాసనసభలో పూర్తిస్థాయి పద్దు ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయం, బడ్జెట్ స్వరూపం, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆదాయార్జాన శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
రూ.2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అంశాలను సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రాష్ట్ర రెవెన్యూ రూ.1,73,766 కోట్లు రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా? అన్న దానిపై చంద్రబాబు ఆరా తీశారు. కొత్త విధానాల వల్ల, తీసుకోబోయే నిర్ణయాల వల్ల రాబడిపై ప్రభావం ఎలా ఉండబోతోందన్న అంశాలపై ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూ (Revenue), రిజిస్ట్రేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నవంబర్ 11న పూర్తిస్థాయి బడ్జెట్
జూన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉండగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్సు (Vote On Account Budget) రూపంలో ఆమోదం తీసుకుంది సర్కార్. ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ నుంచి ఆమోదం తీసుకోవడంతో 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నవంబరు 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదం తీసుకోనుంది.






