ManaEnadu : కార్తిక మాసం (Karthika Masam) వచ్చేసింది. తెల్లవారుజామునే భక్తులంతా శైవాలయాలకు చేరుకుని దీపారాధన చేస్తున్నారు. ఇక ఈ మాసంలో చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. మరి ఉపవాసం ఎలా చేయాలి..? ఎలా చేస్తే ఉపవాస ఫలితం లభిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్తిక ఉపవాసం
చాలా మంది ఈ మాసమంతా ఒంటిపూట భోజనం చేస్తుంటారు. కొందరేమో కేవలం సోమవారం, కార్తిక పౌర్ణమి రోజున ఉపవాసం చేస్తుంటారు. అసలు ఉపవాసం (Fasting) అంటే ఏంటంటే..? ఉప అంటే భగవంతునికి దగ్గరగా ‘వాసం’ అంటే వసించడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్ధం. అందుకే దేవుడుకి దగ్గరగా ఉండేందుకు చాలా మంది భక్తులు ఉపావసం ఉంటుంటారు. అయితే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు మనసుని, ఇంద్రియాలను ఆ భగవంతుడిపై నిగ్రహించడం.
ఉపవాసం ఎలా చేయాలి?
ఉపవాసం ఏ రోజు చేయాలనుకుంటారో ఆ రోజంతా పండ్లు, పాలు, పళ్ల రసాలు (Fruit Juices) వంటివి తీసుకోవచ్చు. ఇక ఆ రోజు సాయంత్రం తిరిగి స్నానం చేసి యథావిథిగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఇంటి గుమ్మలో దీపాలు వెలిగించాలి. శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడి దర్శనం అయ్యాక వీలైతే అక్కడ కూడా దీపారాధన చేయాలి. ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.
కార్తికమాసంలో ఉష్ణోగ్రత, చలి రెండూ సమానంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సమయంలో శరీరంలో సమతుల్యత వృద్ధి చెంది రోగాల బారిన పడకుండా ఉపవాసదీక్షలు శరీరానికి మేలు చేస్తాయి. అందుకే కార్తిక మాసంలో ఉపవాసం చేయడం ఆధ్యాత్మికపరంగానే కాదు ఆరోగ్యకరంగానూ మనకు మేలు చేస్తుంది. అయితే కార్తిక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేస్తే శివసాయుజ్యాన్ని పొందుతారని కార్తికపురాణం చెబుతోంది.






