ManaEnadu : పవిత్ర కార్తిక మాసం (Karthika Masam) వచ్చేసింది. ఈ మాసంలో భక్తులంతా తెల్లవారుజామునే శైవాలయాలకు చేరుకుని దీపారాధన చేస్తుంటారు. ఇక కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. చాలా మంది ఈ నెలలో శైవ క్షేత్రాలకు బారులు తీస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) కీలక నిర్ణయం తీసుకుంది.
శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
పవిత్ర కార్తిక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar) వెల్లడించారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట క్షేత్రాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చువల్గా సమీక్షా సమావేశం నిర్వమించారు.
15న అరుణాచలానికి ప్రత్యేక బస్సు
ఆర్టీసీకి కార్తిక మాసం, శబరిమల (Sabarimala) ఆపరేషన్స్ చాలా కీలకమని సజ్జనార్ తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి (Karthika Pournami) నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని వివరించారు.
పంచారామాలకు స్పెషల్ బస్సులు
మరోవైపు ఏపీలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను http://tgsrtcbus.in వెబ్సైట్లో చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించ వచ్చని వెల్లడించారు. ఇంకోవైపు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించినట్లు సజ్జనార్ తెలిపారు. శబరిమలకు, శుభ ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని సూచించారు.