Mana Enadu : పశ్చిమాఫ్రికా దేశం గినియాలో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ వంద మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని వందల మంది దాకా గాయపడ్డట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా తెలుస్తోంది. గినియా దేశంలో ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ ఒక జట్టుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మరో జట్టు సభ్యులు గొడవపడ్డారు. ఇది కాస్త స్టేడియంలో ఉన్న రెండు జట్ల అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకురావడంతో మరింత పెద్దగా మారి ఘర్షణకు దారి తీసింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
గొడవ ఇలా ప్రారంభమైంది
గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం జెరెకొరె నగరంలో ఓ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. ఇలా ప్రారంభమైన గొడవ నగర వీధుల్లోకి వచ్చి ఒకరి పై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. వివిధ ఇండ్లకు, బిల్డింగులకు నిప్పు పెట్టారు. దారుణాలకు తెగ బడ్డారు. వీధుల్లో ఎక్కడ చూసిన డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా ప్రపంచంలో ఎక్కువ మంది ఫుట్ బాల్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అన్ని క్రీడల్లో కంటే ఫుట్ బాల్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పిచ్చి ప్రేమ కనబరుస్తుంటారు. ఫుట్ బాల్ మ్యాచుల్లో అనేక సార్లు గొడవలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పదులు, వందల సంఖ్యలో మరణాలు సంభవించిన ఘటనలు కూడా ఉన్నాయి.
పలుమార్లు గొడవలు జరిగిన సందర్భాలివే
- ఈజిప్టు రాజధాని కైరోలోని స్టేడియంలో ఫుట్ బాల్ క్లబ్ జమాలేక్ ఫుట్బాల్ క్లబ్ అభిమానులు, పోలీసులు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కనీసం 22 మంది చనిపోయారు. 2012లో ఈ ఘటన చోటుచేసుకుంది.
- 2012 ఫిబ్రవరిలో ఫోర్ట్ సయీద్ నగరంలో అల్-మస్రీ, అల్- అహ్లి జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండు జట్ల అభిమానులు గొడవలకు దిగారు. ఈ ఘటనలో కనీసం 73 మంది చనిపోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఈజిఫ్ట్ ఫుట్బాల్ లీగ్ను రెండేళ్లు రద్దు చేశారు.
- ఆఫ్రికాలో జరిగిన అత్యంత ఘోరమైన ఫుట్బాల్ ప్రమాదంలో కనీసం 126 మంది చనిపోయారు. ఘనా రాజధాని అక్రాలోని ప్రముఖ స్టేడియంలో మ్యాజ్ జరుగుతున్న సమయంలో అభిమానులు రెచ్చిపోయారు. పోలీసులు కాల్పులు జరపడంతో తొక్కిసలట మొదలైంది. దీంతో ప్రేక్షకులు భారీ సంఖ్యలో చనిపోయారు. ఈ ఘటనలో పోలీసులపైనే ఆరోపణలు వచ్చాయి.
- దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 2001 దక్షిణాఫ్రికా లీగ్ ఒక మ్యాచ్ సందర్భంగా అభిమానులు మ్యాచ్ మధ్యలో మైదానంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించారు. తొక్కిసలాట జరగడంతో 43 మంది చనిపోయారు.
- 1996 లో గ్వాటెమాలా సిటీలో కోస్టారికా, గ్వాటెమాలా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తొక్కిసలాట జరగడంతో 82 మంది చనిపోయారు. 147 మంది గాయపడ్డారు.






