Mana Enadu : మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి.
ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా
ముంబయి ఆజాద్ మైదాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం(Maharashtra Deputy CM)లుగా ఇద్దరు నేతలు ప్రమాణం చేశారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ శిందే (Eknath Shinde), ఎన్సీపీ నేత అజిత్ పవార్ల (Ajit Pawar)తో గవర్నర్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతోపాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడోసారి సీఎంగా ప్రమాణం
2014లో దేవేంద్ర ఫడణవీస్ తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా వ్యవహరించిన ఆయన 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణం (Devendra Fadnavis Oath) చేశారు. కానీ అప్పటి రాజకీయ అనిశ్చితి వల్ల మూడ్రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఆయన గురువారం రోజున (డిసెంబరు 6న) మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మహాయుతి కూటమి ఘనవిజయం
ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మహాయుతి కూటమి (mahayuti alliance).. 288 అసెంబ్లీ స్థానాలకుగానూ 230 స్థానాల్లో గెలుపొందింది. 132 స్థానాల్లో బీజేబీ, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మహాయుతి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది.







