Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఈ జంట కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉంది. డేటింగ్ సమయంలో ఈ ఇద్దరి గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకు ఒక్కటైన ఈ జంట పెళ్లి (Naga Chaitanya Sobhita Dhulipala) తర్వాత మొదటి సారిగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఈ కొత్త జంట తమ పరిచయం, ప్రేమ గురించి చెప్పారు.
తొలి పరిచయం అక్కడే
ఈ సందర్భంగా శోభిత (Sobhita Dhulipala) మాట్లాడుతూ.. తొలిసారి చైతూని కలిసినప్పటి క్షణాలను గుర్తు చేసుకుంది. 2018లో అక్కినేని నాగార్జున ఇంట్లో చైతూను మొదటిసారి కలిసినట్లు చెప్పింది శోభిత. ఇక 2022 ఏప్రిల్ తర్వాత తమ మధ్య స్నేహం మొదలైందని.. అయితే తమను దగ్గర చేసింది మాత్రం తెలుగు భాషేనని చెప్పుకొచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్యను తాను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నట్లు తెలిపింది.
మేం కలిస్తే అదే టాపిక్
‘నేను ఫుడ్ లవర్ ని.. చైతన్యను ఎప్పుడు కలిసినా మేం ఫుడ్ గురించే మాట్లాడుకునే వాళ్లం. మా అభిప్రాయాలు షేర్ చేసుకునే వాళ్లం. సాధారణంగా నేను ఎక్కువగా ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడుతుంటా. చైతూ మాత్రం తెలుగులోనే మాట్లాడమని తరచూ అడిగేవాడు. అలా తెలుగులో మాట్లాడటం వల్లే మా బంధం బలపడింది. (Naga Chaitanya Sobhita Dhulipala Love Story)
అది మాత్రమే లైక్ చేసేవాడు
నేను ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్. గ్లామరస్ ఫొటోలతో పాటు నాకు ప్రేరణ కలిగించే స్టోరీస్, పలు విషయాలపై నా అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాను. అయితే చైతూ ఫొటోలను ఎప్పుడూ లైక్ చేయలేదు.. కానీ నేను పెట్టే స్ఫూర్తిమంతమైన కథనాలను మాత్రం తప్పకుండా లైక్ చేసేవాడు.’ అని శోభిత చెప్పుకొచ్చింది.
గోరింటాకు పెట్టుకున్నాం
మొదటిసారి తామిద్దరం ముంబయిలోని ఓ కేఫ్‌లో కలిశామని శోభిత చెప్పింది. అప్పుడు చైతన్య హైదరాబాద్, తాను ముంబయిలో ఉండేవాళ్లమని.. తన కోసం చై హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చేవారని తెలిపింది. మొదటిసారి తాము బయటకు వెళ్లినప్పుడు తాను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ధరించామని.. కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లి అక్కడ కాసేపు గడిపి ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నామని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Event) ఈవెంట్‌కు వెళ్లామని చెప్పిన శోభిత.. అప్పటినుంచి జరిగినదంతా అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంది.
గోవాలో పెళ్లి ముచ్చట్లు
‘నాగచైతన్య కుటుంబం న్యూ ఇయర్ వేడుకలకు నన్ను ఆహ్వానించింది. ఆ తర్వాత సంవత్సరం చైతన్య మా కుటుంబాన్ని కలిశాడు. ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి గురించి గోవాలో మాట్లాడుకున్నాం. అలా ఆగస్టులో కొంతమంది మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. ఇక ఇటీవలే హైదరాబాద్ లో ఒక్కటయ్యాం (Naga Chaitanya Sobhita Dhulipala Wedding).’ అని శోభిత తెలిపింది.
ఆమెను తరచూ అదే అడిగేవాడిని
ఇదే ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ.. శోభితను ఎప్పుడు కలిసినా తెలుగులో మాట్లాడమని అడిగేవాడినని తెలిపారు. సాధారణంగా ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వారిని కలుస్తుంటామని.. వారిలో తెలుగు వాళ్లెవరైనా కనిపిస్తే తనకు ముచ్చటేస్తుందని చెప్పారు. తెలుగు మాట్లాడేవారితో తాను త్వరగా కనెక్ట్ అవుతానని వెల్లడించారు. అందుకే శోభిత పరిచయం అయ్యాక తనతో తెలుగులోనే మాట్లాడాలని తరచూ అడిగేవాడినని చెప్పుకొచ్చారు.






