కన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత పిల్లలదేనని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. ఆ బాధ్యత విస్మరించిన కుమారులు, కూతుళ్లకు కన్నవాళ్ల ఆస్తిని పొందే హక్కు లేదని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ఆస్తి తీసుకుని వారిని పట్టించుకోకుండా బాగోగులు చూడటం మానేసిన ఓ ప్రబుద్ధుడి కేసు సందర్భంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టును ఆశ్రయించిన తల్లి
మధ్యప్రదేశ్ చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ మహిళ తన కుమారుడికి కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ (Gift Deed) రూపంలో రాసిచ్చిన తర్వాత అతడు వారిని పట్టించుకోవడం మానేశాడు. మిగతా ఆస్తి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు నిరాకరించడంతో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ తల్లి కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి వయోధికుల ఆస్తి హక్కును పునరుద్ధరించగా.. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది.
సుప్రీం కీలక వ్యాఖ్యలు
అయితే, హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికే ఆస్తి (Property) దక్కుతుందని పేర్కొనడంతో ఆ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వృద్ధుల హక్కులను పునరుద్ధరించిన ధర్మాసనం.. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా కన్న తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించాలని పేర్కొంటూ కుమారుడికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వృద్ధులకు అండగా చట్టం
బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునళ్లు (Tribunals) – కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తి హక్కులను తిరిగి తమకే దక్కేలా చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చను.. వృద్ధులు ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులను ఆశ్రయిస్తే.. ఆర్థిక పరమైన భరోసా లభిస్తుందని వెల్లడించింది.






