ఓ జూ కీపర్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేసేందుకు సాహసం చేసి ఆఖరికి సింహాలకు (lions attack on Zoo keeper) ఆహారమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గర్ల్‌ఫ్రెండ్‌ను ఆకట్టుకునేందుకు ఎవరైనా గిఫ్ట్‌లతో సర్ప్రైజ్ చేస్తారు. ఇంకొందరు సినిమాలు, ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్లారు. కానీ, ఉజ్బెకిస్థాన్ (Uzbekistan)కు చెందిన ఓ ఓ వ్యక్తి మాత్రం తన ప్రేయసిని ఆకట్టుకునేందుకు పెద్ద సాహసమే చేసి సింహాలకు బలయ్యాడు.
దాడి చేస్తున్నా వీడియో చిత్రీకరణ
ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇరిస్కులోవ్ (44) అనే వ్యక్తి పార్కెంట్ నగరంలోని ఓ ప్రైవేట్ జూలో జూ కీపర్‌గా పని చేస్తున్నాడు. అయితే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి వాటితో వీడియోలు తీసుకొని గర్ల్‌ఫ్రెండ్ మెప్పు పొందాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే కొద్దిరోజుల క్రితం రాత్రి విధుల్లో ఉండగా.. మూడు సింహాలున్న ఓ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. నిద్రపోయిన సింహాలు అతడిని ఏమీ చేయలేదు. కానీ అత్యుత్సాహం ప్రదర్శించిన ఇరిస్కులోవ్.. ఒక సింహాన్ని నిశ్శబ్దంగా ఉండూ అని అన్నాడు. అలికిడి విన్న మిగతా సింహాలు అతడిని సమీపించి దాడి చేశాయి. దాడి చేస్తున్న సమయంలోనూ అతడు వీడియో తీయడం గమనార్హం. కొద్దిసేపటికి అతడిని హతమార్చిన సింహాలు ఆ తర్వాత అతడి శరీరాన్ని పాక్షికంగా తినేశాయి.
ఓ సింహాన్ని చంపిన సిబ్బంది
విషయం గమనించిన ఇతర సిబ్బంది రెండు సింహాలను అదుపుచేసి, మరో దాన్ని కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మృతుడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.






