రోజుకు రూ.300 కోట్లు సంపాదిస్తున్నా.. బిలియనీర్లు ఆరోగ్యంగా ఉండాలనే దేవుడిని కోరుకుంటారని దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings) పేరిట పాడ్‌కాస్ట్ నిర్వహిస్తున్న ఆయన.. తాజాగా బిలియనీర్లపై మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో పూరి ఏం చెప్పారంటే..
అందుకే అవి బిలియనీర్ సిటీస్
‘‘ఫోర్బ్స్ లిస్టు ప్రకారం.. ప్రపంచంలో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది బిలియనీర్లు ఉండగా.. వారిలో 10 శాతం మహిళలున్నారు. ప్రపంచంలోని సగం సంపదంతా ఈ మూడు వేల మంది వద్దే ఉంది. 2023లో స్వయంగా ఎదిగిన బిలియనీర్ అలెగ్జాండర్ వాంగ్ 20 ఏళ్లకే సంపన్నుడయ్యాడు. ఎక్కువ మంది సంపన్నులు జీవించే ప్రాంతాలైన న్యూయార్క్ (New York), మాస్కో, హాంకాంగ్, ముంబయిలను బిలియనీర్ సిటీస్ అని అంటారు. ఈ మూడు వేల మంది సంపన్నులు దేవుడి ముద్దు పిల్లలు.
బిలియనీర్ల కోరిక అదే
మనకంటే ఎక్కువగా ఈ బిలియనీర్లు దేవుడిని మొక్కుతారు. అయితే వారు సంపద కోసం కాకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. వయసు మీద పడుతున్న బిలియనీర్లు.. రోజులు గడుస్తుంటే భయపడుతూ బతుకుతుంటారు. ఆయుష్షు ఎలాగో పెరగదు కాబట్టి బతికినంత కాలం ఆనందంగా ఉంటూ మంచాన పడకుండా పోవాలని కోరుకుంటారు. అందుకే పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. మనం జీవితంలో ఆరోగ్యంగా ఉంటే చాలు. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దాడతాడు. అయితే అప్పటికి అది అనుభవించేందుకైనా ఆరోగ్యంగా ఉండాలి.’’ అంటూ ముగించారు.







