కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో నాకు తెలుసు. అందుకే అణిగిమణిగి ఉంటూ కష్టపడాలని ఫిక్స్ అయ్యాను. ఒకే ఒక జీవితం.. అనుకున్నది సాధించాలి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. రామ్ చరణ్ (Ram Charan).. నా కుటుంబమంతా నా అఛీవ్మెంట్స్. టాలెంట్ ఉంటే సరిపోదు వ్యక్తిత్వం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందుగా నన్ను ప్రేక్షకులే గుర్తించారు తప్ప ఇండస్ట్రీ కాదు. అందుకే క్రమశిక్షణ చాలా అవసరం. అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ‘క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్-2025(Catalyst Global Business Conference)’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
అక్కడికి ఎవరెళ్లమన్నారు
ఈ వేదికపై మాట్లాడిన చిరు.. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని తాను ఎలా ఎదుగుతూ వచ్చానో షేర్ చేసుకున్నారు. బిజినెస్ మైండ్‌కు తగ్గట్టు దాన్ని వ్యాపారులు అన్వయించుకోవచ్చని తెలిపారు. “పాండిబజార్ వెళ్లినప్పుడు అప్పటికే సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న వాళ్లను చూసి నిరుత్సాహం ఆవహించేది. అప్పుడు నేను బలంగా నమ్మే ఆంజనేయస్వామిని స్మరించుకునే వాడిని. ‘నెగెటివిటీ ఉన్న చోటికి నిన్నెవరు వెళ్లమన్నారు? పాజిటివ్‌గా ఉంటూ విజయం సాధించు’ అని ఆయన నాకు చెప్పినట్టుగా అనిపించేది. అంతే నా ఆలోచనాసరళి మారిపోయింది అప్పుడు.
టాలెంట్ కాదు.. బిహేవియర్ ముఖ్యం
అలా సినిమాల్లోనే రాణించాలని ఫిక్స్ అయిన నేను ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ నా లక్ష్యాన్ని తప్ప మిగతా వేటిని నేను పట్టించుకోలేదు. మొదట ఫెయిల్ అయినా, నన్ను చాలా సినిమాల్లో నుంచి అర్ధాంతరంగా తీసేసినా తొణకలేదు. బెణకలేదు. మీ బలం మీ పాజిటివ్ థింకింగ్. కెరీర్ ఆరంభంలో సంపాదన ప్రధానం కాదు మనల్ని మనం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే టాలెంట్ ఉంటే మాత్రమే సరిపోదు..బిహేవియర్ కూడా చాలా ముఖ్యం.” అని చిరంజీవి ఈ కార్యక్రమంలో నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.







