టిక్ టాక్ వీడియోలు చేద్దామంటూ ఓ బాలికను ఇంటికి పిలిచాడు. అలా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానంటూ బెదిరించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె 4 నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఆమె తల్లి ఆ పాపను మందలించగా అసలు విషయం బయటకు వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
యూట్యూబర్, ఫన్ బకెట్ ఫేం చిప్పాడ భార్గవ్ యూట్యూబ్ (Youtuber Bhargav) లో షార్ట్ వీడియోస్ తీస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే టిక్ టాక్ వీడియోలు తీద్దామంటూ ఓ బాలికక ఆశచూపి తన నివాసానికి తీసుకెళ్లాడు. అలా వీడియోల పేరుతో ఇంటికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే వీడియోలన్నీ నెట్టింట పోస్టు చేస్తానంటూ బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు.
ఇంటికి పిలిచి పలుమార్లు రేప్
అయితే కొన్నాళ్లకు ఆమెకు కడుపు నొప్పి రావడంతో తల్లికి చెప్పింది. తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆ బాలిక 4 నెలల గర్భవతి అని తేల్చారు. ఈ విషయంపై కూతుర్ని మందలించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాలిక తల్లి 2021లో భార్గవ్ పై విశాఖలో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. తాజాగా విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు (Visakha Special Pocso Court) ఈ కేసులో తీర్పు వెల్లడించింది.
20 ఏళ్లు జైలు శిక్ష
ఈ సందర్భంగా మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన ఫన్ బకెట్ భార్గవ్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే 4 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.







