“ఆంధ్రప్రదేశ్ లో సినిమాలకు ఓ వైబ్ ఉంటుంది. అక్కడి జనం సినిమా అంటే చాలా ప్రాధాన్యమిస్తారు. కానీ తెలంగాణలో అలా కాదు. మనోళ్లకు కల్లు, మటన్ ముక్క ఉంటే చాలు.” అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో దిల్ రాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణలో సినిమాలు చేస్తూ.. తెలంగాణ ప్రజలనే ఇలా అంటావా అంటూ నెటిజన్లు విపరీతంగా ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో దిగొచ్చిన దిల్ రాజు (Dil Raju) తెలంగాణ ప్రజలు క్షమాపణలు చెప్పాడు. తెలంగాణ వాసిగా తాను ఈ రాష్ట్రాన్ని హేళన ఎలా చేస్తానంటూ ప్రశ్నించాడు. తెలంగాణ సంస్కృతిని తాను అభిమానిస్తానని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో దిల్ రాజు ఇంకా ఏం మాట్లాడాడంటే..?
‘‘నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్కడ చేశాను. ఆ ఈవెంట్లో నేను మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడాను. కానీ కొందరు నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారు. తెలంగాణ వాళ్లను నేను అవమానించానని, హేళన చేశానని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని నేను అభిమానిస్తాను. బాన్సువాడలోనే ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ‘బలగం’ చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ చిత్రాన్ని అభినందించారు. తెలంగాణ వాసిగా నేను ఏవిధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.







