నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Accident) వద్ద శనివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయిన ఘటనలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనాస్థలిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.
8 మందిని మేం కాపాడతాం
అనంతరం అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరు గురించి వివరించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లిన తర్వాత 8.30గంటలకు బోరింగ్ మిషన్ ఆన్ చేయడంతో.. టన్నెల్‌లో ఒకవైపు నుంచి నీరు లీకై మట్టి కుంగి పెద్ద శబ్దం వచ్చిందని మంత్రి ఉత్తమ్ (Minister Uttam Kumar) తెలిపారు. టీబీఎం ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి 42 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చారని వెల్లడించారు. కానీ బోరింగ్ మిషన్ ముందున్న 8 మంది టన్నెల్ లోనే చిక్కుకుపోయారని.. వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రెస్క్యూ టీమ్ వస్తోంది
“గతంలో ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘటన జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే టన్నెల్‌లో వారిని రెస్క్యూ చేసిన ఎక్స్‌పర్ట్స్‌తో మేం మాట్లాడి వాళ్లను సురక్షితంగా ఎలా బయటకు తీయాలో ప్రణాళిక రూపొందించాం. వారిని కాపాడే రెస్క్యూ టీమ్ (Rescue Team) రాత్రి వరకు ఘటనాస్థలికి చేరుకుంటుంది. అప్పటి వరకు వారిని సురక్షితంగా ఉంచే బాధ్యత ప్రభుత్వానిది. టన్నెల్‌లో చిక్కుపోయిన వారు ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్ వాసులుగా గుర్తించాం. టన్నెల్‌లో చిక్కుకున్న వారికి వెంటిలేషన్ ఇబ్బంది లేదు. అయితే 14 కిలోమీటర్ల లోపల ఇరుక్కోవడం వల్ల వాళ్లను ఇప్పుడు బయటకు సురక్షితంగా తీసుకురావడం కాస్త సవాల్ గా మారింది.’’ అని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.






