మరో 20 రోజుల్లో ఐపీఎల్(Indian Premier League) రూపంలో క్రికెట్ సందడి మొదలు కానుంది. మార్చి 22న మొదలు కానున్న ఈ T20 లీగ్ సంబరం మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. దీంతో ఈ సమ్మర్ మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపనుంది. స్వదేవీ, విదేశీ క్రికెటర్ల బ్యాటింగ్ విన్యాసాలు.. ఆకట్టుకునే బౌలింగ్ స్పెల్స్ కనువిందు చేయనున్నాయి. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ(KKR vs RCB) మధ్య జరగనుంది. అయితే ఈసారి ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ(Board of Control for Cricket in India) కొన్ని కొత్త ఆంక్షలు విధించింది.
ఒక్కో జట్టుకు ఏడు ప్రాక్టీస్ సెషన్స్
కొత్త సీజన్‌కు ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జట్ల ప్రాక్టీస్ సెషన్ల(Practice Sessions)పై బీసీసీఐ రూల్స్(Rules) పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో జట్టుకు 7 ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే 2 వార్మప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగించరాదు. అలాగే ఐపీఎల్ వేదికలలో ఇతర టోర్నీల నిర్వహణకు అనుమతి లేదు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌లోని సైడ్ వికెట్‌లలో ఒకదానిపై జరగాలి. ఫ్లడ్ లైట్ల కింద కేవలం 3.30 గంటలు మాత్రమే ప్రాక్టీస్‌కు అనుమతి ఉంటుంది.
ముందస్తు రాతపూర్వక అనుమతి తప్పనిసరి
అలాగే ఈ ఆపరేషనల్ రూల్స్(Operational Rules) ప్రకారం ప్రాక్టీస్ మ్యాచ్‌లకు BCCI ముందస్తు రాతపూర్వక అనుమతి తప్పనిసరి. సీజన్ కోసం పిచ్‌ను సిద్ధం చేయడానికి సంబంధిత ఫ్రాంచైజీ సీజన్‌లో మొదటి హోమ్ మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్‌లో ఎటువంటి ప్రాక్టీస్ సెషన్‌లు లేదా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదు. రెండు జట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే సెషన్ల వారీగా అవకాశం ఇస్తారు. ఈ మేరకు కొత్త నిబంధనలను బీసీసీఐ నోట్ ద్వారా ఐపీఎల్ జట్లకు తెలియజేసింది.






