అనుమానంతో భార్యను చంపిన భర్త, వివాహేతర సంబంధం వల్ల భర్తను హతమార్చిన భార్య.. ఇలాంటి వార్తలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. సోషల్ మీడియా పేట్రేగిపోతున్న నేటి రోజుల్లో చిన్నచిన్న వాటికే ఆత్మహత్యలు, క్షణికావేశంలో హత్యలు (Murders) పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా వాట్సాప్ లో ఓ కిస్ ఎమోజీ పెట్టిన చిచ్చు రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తన భార్యకు ఆమె స్నేహితుడు కిస్ ఎమోజీ (Kiss Emoji) పంపడం చూసిన భర్త అనుమానంతో ఆ ఇద్దరిని హతమార్చాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
కేరళలోని పతనంతిట్టలోని కలంజూరులో బైజు, వైష్ణవి దంపతులు నివసిస్తున్నారు. వాళ్ల ఇంటి పక్కనే తల్లితో కలిసి విష్ణు అనే వ్యక్తి ఉంటున్నాడు. విష్ణు, బైజు కలిసి రోజు పనికి వెళ్లేవారు. విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సాప్కు కిస్ ఎమోజీని పంపాడు. అది బైజు చూశాడు. ఈ విషయంలో ఆమెతో గొడవ పడ్డాడు. కొడవలి పట్టుకుని చంపేందుకు ప్రయత్నించడంతో భయపడిన వైష్ణవి పొరుగింట్లోకి వెళ్లింది.
ఇద్దరినీ నరికేశాడు
వైష్ణవిని బయటకు రమ్మని బైజు కేకలు వేసినా ఆమె వినకపోవడంతో విష్ణు ఇంటి లోపలికి వెళ్లిన బైజు పెరట్లోకి ఆమెను లాక్కెళ్లి నరికేశాడు. ఈ గొడవ ఆపేందుకు ప్రయత్నించిన విష్ణుపై కూడా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విష్ణు, వైష్ణవిలను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఇద్దరు మార్గమధ్యలోనే చనిపోయారు. ఈ ఘటన గురించి బైజు స్నేహితుడికి చెప్పడంతో అతడి మిత్రుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.






