
సర్కార్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీపికబురు అందించబోతున్నట్లు సమాచారం. ఈ హోలీ పండుగకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. ఈ పండుగ సందర్భంగా డీఏను (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి కూడా డీఏను మరో 3 శాతం పెంచనున్నట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం 53 శాతంగా ఉన్న డీఏ 56 శాతానికి చేరనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
14వ తేదీన అధికారిక ప్రకటన
మార్చి 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా డీఏ (DA) పెంపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగుల డీఏను పెంచాల్సి ఉంటుంది. జనవరి, జులైల్లో డీఏ పెంపు జరగాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మార్చి, అక్టోబరులో ప్రకటిస్తోంది. అయితే ప్రకటనలో ఆలస్యమైనా.. బకాయిలతో కలిపి చెల్లిస్తోంది.