తెలంగాణలోని నిరుద్యోగ యువత(Unemployed Youth)కు కాంగ్రెస్ సర్కార్ తీపికబురు అందించింది. నిరుద్యోగులు తమ కాళ్లపై తాము నిలదొక్కుకునేందుకు ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం రేవంత్(CM Revanth) సర్కార్ నిర్ణయించింది. ‘‘రాజీవ్ యువ వికాస్ పథకం(Rajiv Yuva Vikas Scheme)’’ ద్వారా యువతకు రూ.3 లక్షల వరకూ రుణం ఇవ్వనుంది. ఈ మేరకు దరఖాస్తుల(Applications) స్వీకరణ ప్రక్రియను నేటి (మార్చి 17) నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. టీజీఓబీఎంఎంఎస్ (TELANGANA ONLINE BENEFICIARY MANAGEMENT & MONITORING SYSTEM) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఏప్రిల్ 5వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది.
ఆ రోజున రుణ మంజూరు పత్రాలు
ఈ పథకం కింద SC, ST, BCలతోపాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు(Self-Employment Loans) మంజూరు చేయనుంది. 60% నుంచి 80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్లికేషన్ల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వాటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ స్కీమ్‌కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రుణాలు
కాగా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాస్ పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే పూర్తి వివరాలకు https://tgobmms.cgg.gov.in/ను విజిట్ చేయాలని కోరింది.








