
హైదరాబాద్ నగరవ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హైదరాబాద్ శాఖ అధికారులు అమెజాన్ గోదాముల(Amazon Go downs)పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీఐఎస్ ధ్రువీకరించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బీఐఎస్ ధ్రువీకరణ పొందని గృహోపకరణాలు, సాంకేతిక ఉపకరణాలను సీజ్ చేశారు. ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో మంగళవారం బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.50 లక్షల పైగా విలువైన 2783 ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
భారీగా ఉత్పత్తులు సీజ్
ఈ తనిఖీల్లో బీఐఎస్ ధ్రువీకరణ లేని ఉత్పత్తులు, ఐఎస్ఐ మార్క్ (ISI Mark), ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ మార్కు లేని ఉత్పత్తులను జప్తు చేసినట్లు బీఐఎస్ అధికారులు వెల్లడించారు. వీటిలో150 స్టార్ట్ వాచ్లు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీటీవీ కెమెరాలు (CCTV Cameras), 16 మిక్సర్లు, 10 ప్రెజర్ కుక్కర్లు, 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్లెస్ ఇయర్ బడ్స్, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇతర గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, జేఎస్ఏ శివాజీ పాల్గొన్నారు.
కఠిన చర్యలు తప్పవు
బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తారు. మొదటిసారి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా.. రెండోసారి దీనికి పదిరెట్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు.