తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా ఉంటారు. ఓవైపు పార్టీ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా ఉండే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ అంటే ఆసక్తి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆసక్తే కాదు అందులో ఆయన నైపుణ్యం కూడా సాధించారు. తాజాగా ఆయన కరాటేలో తన నైపుణ్యాన్ని చూపించారు. ఏకంగా అందులో బ్లాక్ బెల్ట్ సంపాదించారు.
టీపీసీసీ అధ్యక్షుడికి బ్లాక్ బెల్ట్
హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిరోడ్డులోని వైడబ్ల్యూసీఏలో సోమవారం రోజున కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మూడు గంటలపాటు జరిగిన నైపుణ్య పరీక్షలో ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫున కరాటే బ్లాక్‌బెల్ట్ డాన్ 7 (TPCC Chief Karate Black Belt) ధ్రువపత్రాన్ని అందజేశారు.
కరాటే నా జీవితంలో భాగం
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ తన జీవితంలో కరాటే (Karate) ఒక భాగమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు పిల్లలను కంప్యూటర్‌కిడ్స్‌లా తయారు చేస్తున్నారని అన్నారు. పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఆటలే వారికి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పారు. చదువు మాత్రమే కాకుండా ఇలాంటి ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో పిల్లల్ని భాగం చేయాలని సూచించారు. 2027లో నగరంలో ఆసియా కరాటే పోటీలను నిర్వహిస్తామని వెల్లడించారు.






