
ఏపీలో వాహనదారులకు షాక్. జాతీయ రహదారులపై టోల్ రుసుములు (Toll Charges Hike in AP) పెంచుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) నిర్ణయం తీసుకుంది. ఏపీ రీజినల్ అధికారి పరిధిలో ఉన్న 68 టోల్ ప్లాజాల్లో.. నాలుగు మినహా మిగిలిన 64 చోట్ల 2025-2026 ఆర్థిక ఏడాదికి టోల్ పెంపు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కిలోమీటరుకు.. కార్లు, జీపులకు రూ.5 పైసలు, బస్సులు, లారీలకు 18 పైసల నుంచి వాటి యాక్సిల్‌ను బట్టి 35 పైసలు వరకు ఎన్‌హెచ్‌ఏఐ పెంచింది.
ఆగస్టులో వాటికి పెంపు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే హోల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా టోల్‌లను ఏటా సవరిస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా టోల్ రుసుంలు పెరిగాయి. ఇక స్థానికులకు అందజేసే నెలవారీ పాస్ ప్రస్తుతం రూ.340 ఉండగా అది ఇప్పుడు రూ.350కి పెరిగింది. నెల్లూరు-తడ మధ్య ఉన్న సూళ్లూరుపేట, బూదనం, వెంకటాచలం టోల్‌ప్లాజాలు, విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఉన్న కీసర టోల్‌ప్లాజా (Keesara Toll Plaza).. ఈ నాలుగు 1997 టోల్ నిబంధనల కింద ఉండటంతో ప్రస్తుతం వీటి టోల్ రుసుం పెరగలేదు. ఏటా ఆగస్టులో వీటికి పెంపు అమలవుతుంది.
ఆ 3 టోల్ ప్లాజాల్లో తగ్గింపు
మరోవైపు విజయవాడ నుంచి హైదరాబాద్ (Vijayawada Hyderabad National High Way)కు వెళ్లే మార్గంలో ఉన్న నాలుగు టోల్‌ప్లాజాల్లో (కీసర, కొర్లపహాడ్, చిల్లకల్లు, పంతంగి) .. కీసర మినహా మిగతా వాటి వద్ద టోల్ రుసుం తగ్గింది. గతేడాది జూన్ ఆఖరి వరకు జీఎంఆర్ సంస్థ (GMR) టోల్ వసూలు చేయగా.. జులై నుంచి ఈ టోల్ ప్లాజాలు ఎన్‌హెచ్‌ఏఐ ఆధీనంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం లెక్కలు వేసి, ఆ మూడు టోల్‌ప్లాజాల్లో తాజాగా రుసుము తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఆ తగ్గింపు అమల్లోకి వచ్చింది.