మధ్యతరగతి ప్రజలకు ఒకేరోజు రెండు షాకులు తగిలాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ గంటల వ్యవధిలో రెండు పిడుగులాంటి వార్తలను చెప్పింది. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాక్ ఇచ్చిన కేంద్రం (Central Govt).. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటన జారీ చేసి వంటింట్లో మంట పెట్టింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నింటి ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వరుస షాకులతో తమపై మరింత భారం పెరుగుతుందని వాపోతున్నారు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు
అయితే మొదట.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో పెట్రోల్ (Petrol Price Hike)పై రూ13, డీజిల్‌పై రూ.10కి ఎక్సైజ్ డ్యూటీ చేరింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత (ఏప్రిల్ 8 నుంచి) పెంచిన ఎక్సైజ్ డ్యూటీ (Diesel Price Hike) అమల్లోకి రానున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. అయితే ఈ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన కాసేపటికే మరో ప్రకటన విడుదల చేసింది. రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో పెరుగుదల ఉండదని చమురు మార్కెటింగ్ కంపెనీలు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.
వంటగ్యాస్ ధరలు పెంపు
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధలపై ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే కేంద్ర సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు (LPG Cylinder Price Hike) పెంచుతున్నట్లు ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కూడా ఈ పెంపు వర్తించనుందని కేంద్రం వెల్లడించింది. దీంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. తమపై మరింత భారం పడిందని వాపోతున్నారు.






