
చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా భారత స్టాక్ మార్కెట్ (Stock Exchange Of India) సూచీలు భారీగా పతనం దిశగా పయనిస్తున్నాయి. సోమవారం ఆరంభ సెషన్లోనే కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 3 వేల పాయింట్లకుపైగా నష్టంతో సెషల్ ప్రారంభించి.. ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా ఆరంభంలో 22వేల మార్క్‌ను కోల్పోయింది. ఆరంభంలోనే మార్కెట్లు కుప్పకూలడంతో భారీగా స్టాక్స్ పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఆసియా మార్కెట్లపై భారీగా కనిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ తో మార్కెట్లు భారీగా పతనమై దేశీయ సూచీల్లో సోమవారం రోజున ‘బ్లడ్ బాత్’ కన్పించింది. ఇవాళ ఉదయం 9.22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 3,233 పాయింట్ల నష్టంతో 72,130 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ (Nifty) 1,022 పాయింట్ల నష్టంతో 21,882 వద్ద కొనసాగుతోంది.
నష్టాల్లో ఉన్న స్టాక్స్ ఇవే
అమెరికాలో ఆర్థిక మాంద్యం (Economic recession in US) తప్పదన్న సంకేతాలతో లోహ కంపెనీల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 19 పైసలు తగ్గి 85.63 వద్ద కొనసాగుతోంది. హిందూస్థాన్ యూనిలివర్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి వంటి కంపెనీల స్టాక్స్ ఇవాళ భారీ నష్టాలను చవిచూశాయి.