
తమిళ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత, నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా(Fatwa) జారీ చేసింది. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతడి గత చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఫత్వాలో పేర్కొన్నారు. మత పరమైన కార్యకలాపాలకు అటువంటి వారిని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరారు.
ఆయన ముస్లింల వ్యతిరేకి
సినిమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ముస్లిం సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నాడని మౌలానా రజ్వీ ఆరోపించారు. గతంలో విజయ్ ముస్లిం వ్యతిరేకి, ఆయన నటించిన ‘ది బీస్ట్’ మూవీలో ముస్లింలను, ముస్లిం సమాజాన్ని తీవ్రవాదులుగా చూపించారని మండిపడ్డారు. నటుడిగా ముస్లింలను వ్యతిరేకించిన ఆయన రాజకీయాల్లోకి రాగానే ఓట్ల కోసం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇఫ్తార్ విందుకు మద్యం తాగే వారిని, జూదగాళ్లను ఆహ్వానించడం నేరమే కాకుండా పాపమని తెలిపారు.
విజయ్‌కు దూరంగా ఉండాలి
మద్యం ప్రియులు, అల్లరి మూకలను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం ద్వారా విజయ్ రంజాన్ మాసం పవిత్రతను దిగజార్చారు. ఈ విందుకు హాజరైన వారిలో చాలా మంది ఉపవాసం పాటించ లేదు. ఇస్లాం ఆచారాలను అనుసరించలేదు. మద్యం తాగి ఇఫ్తార్ కు వచ్చారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం. అందుకే తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలి. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దు. మతపరమైన కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించవద్దు. అని రజ్వీ విజ్ఞప్తి చేశారు.