
ఇద్దరు అక్కా చెల్లెల్ల పెళ్లి ఒకే రోజు జరగడం చూశాం. ఒకే మండపంలో రెండు వివాహాలు జరగడమూ చూశాం. కానీ ఒకే మండపంలో ఒకేసారి ఇద్దరు యువతులను ఒకే యువకుడు పెళ్లాడటం గురించి విన్నారా.. ఈ వింత వివాహం తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ గిరిజన యువకుడు ఒకే రోజు, ఒకే మండపంలో ఇద్దరి మెడలో ఆరు ముళ్లు వేశాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఏడడుగులు నడిచారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభ బాయ్, బద్రుషావ్ దంపతుల కుమారుడు ఛత్రుషవ్ వివాహం ఖాయమైంది. అందరిలాగే ఇది సాధారణమైన పెళ్లి అయితే మనం మాట్లాడుకునే వాళ్లం కాదు. కానీ ఛత్రుషవ్ కు.. జైనూర్ మండలం పూనగూడకు చెందిన జంగుబాయి, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోమ్‌దేవిలకు వివాహం నిశ్చయమైంది. అంటే ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లి ఫఇక్స్ అయింది.
ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లి
ఇద్దరమ్మాయిల కుటుంబాల సమ్మతితో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం గురువారం రోజున ఛత్రుషవ్-జంగుబాయి-సోమ్ దేవిల వివాహం ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు, గ్రామస్థులు యువతుల అభిప్రాయాన్ని కోరగా, వారు సరే అనడంతో పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. గురువారం రోజున ఇద్దరు అమ్మాయిలతో ఒకే వేదికపై ఆదివాసీల సంప్రదాయాల ప్రకారం ఛత్రుషవ్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకు బంధువులతో పాటు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వివాహం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.