రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా 12 దేశాలకు షాక్ ఇచ్చారు. ఆ దేశ పౌరులు ఇకపై అమెరికాకు రావొద్దని నిషేధం (Travel Ban on Countries) విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై బుధవారం ఆయన సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై జరిగిన దాడి నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అఫ్గాన్, ఇరాన్, లిబియా…
అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, సోమాలియా, సూడాన్, ఈక్వెటోరియల్ గినియా, చాద్, కాంగో, ఎరిట్రియా, హైతీ, లిబియా, దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. వెనెజువెలా, తుర్కమేనిస్థాన్, బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో దేశాలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ నిషేధాజ్ఞలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.
అమెరికాలో అలాంటి ఘటనలు జరగనివ్వం
‘కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో (colorado boulder county Terror Attck) ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్‌లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేము. అందుకే ఈ రోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా’ అని ట్రంప్ వెల్లడించారు. అయితే ట్రంప్ చేసిన ఈ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.