తెలంగాణలోని గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలోని గ్రూప్-3 పోస్టుల(Group-3 posts)కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ షెడ్యూల్(Certification Verification Schedule) రిలీజైంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 18 నుంచి జులై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్(Public Gardens)లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ(Suravaram Pratap Reddy University)లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని వెల్లడించింది.
ఈ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి..
ఈ మేరకు గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ల(Hall Ticket Nos)తో పాటు వెరిఫికేషన్‌కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు తీసుకుని రావాలని కోరింది. ఈ మేరకు ఆయా ధ్రువపత్రాల జాబితా(List of Certificates)ను విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు TGPSC తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల(Original Certificates)తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీ(Set self-attested)లు తీసుకురావాలని సూచించింది.







