దేశాల మధ్య యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఫలితంగా చమురు ధరలు (Oil Prices) భగ్గుమంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు (US Attacks On Iran), హార్ముజ్ జలసంధి మూసివేత హెచ్చరికలు ఆసియా మార్కెట్‌లపై త్రీవ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం ముడి చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగి ఐదు నెలల గరిష్ఠాన్ని తాకాయి. ఇరాన్ ప్రతీకార చర్యలపై ఆందోళనలు పతాకస్థాయికి చేరడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
ఏకంగా 2.8 శాతం ధరలు పెరిగాయి…
హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ముడి ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. సోమవారం ఏకంగా 2.8 శాతం ధరలు పెరిగాయి. తాజా ట్రేడింగ్‌లో యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ (ముడి చమురు) ధర 2.8 శాతం మేర పెరిగి 75.98 డాలర్లు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.12 డాలర్లు చేరింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఇప్పటివరకూ 76 శాతం మేర పెరిగాయని జేపీ మోర్గన్ ఎనలిస్టులు చెబుతున్నారు. అయితే, హార్ముజ్ జలసంధిని మూసివేస్తే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లకు ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రోజుకు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి
హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ అంగీకరించిందన్న వార్తలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. ఇరాన్ ప్రస్తుతం రోజుకు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేయగా నష్టం ఎంత జరిగిందనే దానిపై మాత్రం స్పష్టత లేదు.






