ఒక వ్యక్తి పేరుపై కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఫ్రీగా వస్తుందంటే సాధారణంగా ఎవరైనా ఎంతో సంతోషంతో ఆ ఆస్తిని స్వీకరిస్తారు. కానీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) మాత్రం అలా చేయలేదు. తనది కాని ఆస్తి తనకు అవసరం లేదంటూ తిరిగి ఇచ్చేసాడు. 2018లో జరిగిన ఈ సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా వెల్లడించారు.
ముంబయిలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో నివసించే నిషా పాటిల్ అనే 62 ఏళ్ల వృద్ధురాలు సంజయ్ దత్ వీరాభిమాని. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో, తన మరణానంతరం 72 కోట్ల ఆస్తి సంజయ్ దత్‌కు చెందాలని వీలునామా ద్వారా పేర్కొన్నారు. 2018 జనవరి 15న ఆమె మరణించిన తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు ఆ వీలునామా చదివి షాక్‌కు గురయ్యారు.
ఈ వార్త తనకు తెలిసినప్పుడు సంజయ్ దత్ భావోద్వేగానికి లోనయ్యారని తెలిపారు. ఒక అభిమాని తనపై అంత ప్రేమ, పుత్ర వాత్సల్యం చూపించడం తనకు గర్వంగా ఉందని చెప్పారు. అయితే, “ఆ ఆస్తిని స్వీకరించే హక్కు నాకు లేదు. అది ఆమె కుటుంబానికి చెందాలి” అని స్పష్టం చేస్తూ ఆ మొత్తం ఆస్తిని తిరిగి వారికే ఇచ్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంలో నెటిజన్లు సంజయ్ దత్‌ను తెగ పొగిడేస్తున్నారు. “ఇలాంటి విలువలున్న వ్యక్తులు ఈ రోజుల్లో అరుదు” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ ‘ది రాజా సాబ్’, ‘అఖండ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.






