హైదరాబాద్(Hyderabad) మహా నగరం అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతుంది. ఐటీ, రియల్టీ, వాణిజ్య రంగాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే నగర విస్తరణ ఎంత వేగంగా జరుగుతున్నా, ట్రాఫిక్ మాత్రం అంతకంటే వేగంగా పెరుగుతోంది. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య దాదాపు 85 లక్షలు దాటిపోయింది. దీనివల్ల ముఖ్య రహదారులపై తీవ్రంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఉద్యోగాల కోసం వెళ్తున్న వారు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఇలా అందరూ రోజూ ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోతున్నారు. రోడ్ల విస్తీర్ణానికి మించి వాహనాలు పెరగడం, పార్కింగ్ సౌకర్యాల కొరత, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లోపాలు ఇవన్నీ కలిసి సమస్యను మరింత పెంచుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణ + పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటక అభివృద్ధితో పాటు ట్రాఫిక్‌ను కూడా తగ్గించే దిశగా కొత్త దిశలో ఆలోచిస్తోంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల మధ్య రోప్‌వే(Ropeway)లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు పర్యాటక ప్రోత్సాహం కూడా కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, నగరంలోని కొన్ని కీలక మార్గాల్లో ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.
మొదటి దశ: గోల్కొండ – కుతుబ్షాహి టూంబ్స్
పర్యాటక శాఖ, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) సంయుక్తంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను(Ropeway Project Set to Launch in Hyderabad) ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్‌లో భాగంగా మొదటి దశలో గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహి టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మించనున్నారు. తర్వాతి దశల్లో ట్యాంక్‌బండ్, మీరాలం ట్యాంక్, సంజీవయ్య పార్క్, కొత్వాల్‌గూడ ఎకో పార్క్ వంటి ప్రదేశాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ప్రయాణీకులకు ఎలాంటి అనుభవం?
రోప్‌వేలో తీగలపై నడిచే బాక్స్ ఆకారపు వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బాక్స్‌లో 6 నుండి 10 మంది వరకు ప్రయాణించగలగడం ద్వారా చారిత్రక ప్రదేశాలను ట్రాఫిక్ ఎక్కు లేకుండా సులభంగా వీక్షించవచ్చు.
సవాళ్లు ఏమున్నా.. ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి
గోల్కొండ-టూంబ్స్ మార్గంలో మిలిటరీ పరిధి ఉండటం వల్ల నిర్మాణానికి అనుమతులు అవసరం. ఇప్పటికే అధికారుల చర్చలు జరుగుతున్నాయి. అనుమతులు వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ప్రయోజనాలు ఏమిటి?
ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది
పర్యాటకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం
నగర ప్రతిష్ట, టూరిజం రంగానికి బూస్ట్
ఈ ప్రాజెక్ట్ అమలైతే, హైదరాబాద్ టూరిజానికి ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది. ఇప్పటికే వరంగల్‌లో కూడా రోప్‌వే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే హైదరాబాద్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మోడల్స్ వేగంగా విస్తరించే అవకాశం ఉంది.






