Mana Enadu: వై నాట్ 175.. నినాదంతో ఏపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న వైసీపీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ఓటరుతో పెట్టుకుంటే జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఒక్కటే. అయితే గత ఎన్నికల్లో సంక్షేమాన్ని నమ్ముకున్న వైసీపీ అధినేత జగన్ దారుణమైన ఓటమిని చవిచూశారు. ఓటరు దేవుళ్ల దెబ్బకు ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది.
అయితే జగన్ ఓటమిని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, యావత్తు సినీ ఇండస్ట్రీ కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ అనేక ఇబ్బందులను ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయం. ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారట. పైగా మెగాస్టార్ చిరంజీవిని సైతం జగన్ అవమానించారని భావించిన సినీ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తిరిగి విజయం సాధించకూడదని భావించింది. దీనిలో భాగంగానే కూటమి అభ్యర్ధులకు బహిరంగంగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించారు.
అసలు వాళ్లతో ఎందుకు..
అందరూ అనుకున్నట్టే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా పార్టీ ఓటమిపై వైసీపీ కీలక నేత , మాజీ మంత్రి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సినిమా వాళ్ల వల్లే వైసీపీ ఓడిపోవడం జరిగిందన్నారాయన. సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినప్పటికి , అది ప్రజలకు ఎక్కలేదని కేతిరెడ్డి తెలిపారు. ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాలను ఎంత ఖర్చు పెట్టి అయినా సరే బ్లాక్లో అయినా కొనుక్కుని చూస్తారని.. వాళ్లకు లేని బాధ మనకెందుకు అని కేతిరెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. “అసలు సినిమా వాళ్లతో గొడవ ఎందుకు జగన్. అనవసరంగా శత్రువులను పెంచుకున్నారు. ” అంటూ కేతిరెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ను కడిగిపారేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.