Mana Enadu:అక్కినేని నాగచైతన్య రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. టాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ్లతో ఇవాళ ఉదయం ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వివాహం చేసుకుంటున్నారు. వారిద్దరు జీవితాంతం ప్రేమగా, సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమంతతో విడాకుల అనంతరం వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా రోజులు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కానీ వీళ్లిద్దరు ఎప్పుడు దానిపై మాట్లాడలేదు. ఇక ప్రస్తుతం ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ కావడంతో చాలా మంది అసలు ఎవరీ శోభిత ధూళిపాళ్ల అని గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు.
చూడ్డానికి హాలీవుడ్ బ్యూటీలా కనిపించినా.. శోభిత దూళిపాళ్ల అచ్చమైన తెలుగమ్మాయి. ఏపీలోని తెనాలిలో 1993 మే 31న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్ రావు, శాంత రావు. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యామిలీ ముంబయికి మారడంతో .. ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది.
మోడలింగ్‌తో ఎంట్రీ..
శోభిత మొదట మోడలింగ్‌లో అరంగేట్రం చేసింది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016లో బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ మూవీ రమన్ రాఘవ్ 2.0లో నటించింది. ఆ తర్వాత తెలుగులో 2018లో గూడఛారి చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మేజర్‌లోనూ సందడి చేసింది. ఇక తమిళ్లో పొన్నియన్ సెల్వన్ మూవీలోనూ నటించింది. వెబ్ సిరీస్‌లలోనూ ఈ భామ తన హవా సాగిస్తోంది. ది నైట్ మేనేజర్లో నటించి మెప్పించింది. ఇక మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.






