ManaEnadu:అస్సాంలోని ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న పదేళ్ల బాలికపై ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఓ హృదయ విదారక విషయం తెలిసింది. ఈ దారుణం చోటుచేసుకునే రెండ్రోజుల ముందే బాధితురాలు.. కోల్‌కతా హత్యాచార ఘటన గురించి పేపర్లో చదివిందట. ఈ క్రమంలో అత్యాచారం అంటే ఏంటని తన బంధువును అడిగిందట. అలా అడిగిన రెండ్రోజులకే ఆ బాలిక గ్యాంగ్ రేప్‌కు గురి కావడం ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది.
అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్‌పై ఇంటికి బయల్దేరగా దారిలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. ఆ తర్వాత సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయాలపాలై, అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలిని పోలీసుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆ బాలిక చికిత్స పొందుతోంది.
ఈ ఘటన గురించి బాలిక బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఓ హృదయవిదారక విషయాన్ని షేర్ చేసుకున్నారు. “బాలిక తండ్రి గువాహటిలో ఉంటారు. ఆయనకు తన కుమార్తెను చదివించే స్థోమత లేక నా వద్దకు పంపారు. పశ్చిమ బెంగాల్ ఘటన గురించి పేపర్లో చదివి.. ‘ఆంటీ రేప్ అంటే ఏమిటి..?’ అని నన్ను అడిగింది. కానీ తనకే ఇలా జరుగుతుందని అనుకోలేదు. తనను కాపాడటంలో నేను ఫెయిల్ అయ్యానని బాధగా ఉంది. ఆమె డీఎస్పీ కావాలని కలగంది. ఆమెను కలిసేందుకు ఆసుపత్రికి డీఎస్పీ వస్తే అంత కష్టంలోనూ చిరునవ్వు నవ్వింది.’’ అని ఆమె బంధువు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా అతణ్ని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన ఘటనపై ఆరా తీస్తుండగా నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చెరువులోకి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. అతణ్ని ప్రాణాలతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా అప్పటికే మరణించాడని పోలీసులు తెలిపారు.







