Mana Enadu: పంజాబ్‌లోని రోపర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు తేగ్‌బీర్ సింగ్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఆఫ్రికన్ ఖండంలోని ఎత్తైన శిఖరం, టాంజానియాలో 19,340 అడుగుల (5895 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. తద్వారా ఆసియా నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
తేగ్‌బీర్ సింగ్ ఆగస్ట్ 18న తన పర్వాతరోహణను ప్రారంభించాడు. ఆగస్ట్ 23న కిలిమంజారో శిఖరాగ్ర భాగమైన ఉహురు శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్నాడు. ఈ విషయాన్ని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) గౌరవ్ యాదవ్ తన ట్విటర్ వేదిక వెల్లడించారు. ఈ సందర్భంగా తేగ్‌బీర్‌ని అభినందించాడు. ‘‘ ఐదేళ్ల వయస్సులోనే అతని సంకల్పం, దృఢత్వాన్ని ప్రశంసనీయం. అతడి విజయం అందరికీ స్ఫూర్తిదాయకం. అతని విజయం ఇతరులను వారి పరిమితులను అధిగమించడానికి ప్రేరేపిస్తుంది” అని తేగ్‌బీర్ ఫొటో షేర్ చేసి దానికి క్యాప్షన్ ఇచ్చారు.
ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేందుకు కఠిన వ్యాయామాలు
కాగా గత ఏడాది ఆగస్టు 6న ఐదేళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సెర్బియాకు చెందిన ఓగ్‌జెన్ జివ్‌కోవిచ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డుతో తేగ్‌బీర్ సమం చేశాడు.ప్రపంచ ట్రెక్కింగ్ పోర్టల్ డేటా ప్రకారం, తేగ్‌బీర్ ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆసియా వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. తేగ్‌బీర్ సింగ్ తన కోచ్, రిటైర్డ్ హ్యాండ్‌బాల్ కోచ్ బిక్రమ్‌జిత్ సింగ్ ఘుమాన్‌కి తన విజయాన్ని అందించాడు. తన ప్రయాణంలో తన కుటుంబం ఎనలేని కృషి చేసిందని తేగ్‌బీర్ చెప్పాడు. ఏడాది క్రితం తాను శిక్షణను ప్రారంభించానని, ఎత్తైన ప్రదేశాలకు సిద్ధం కావడానికి, గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు చేసినట్లు ఆయన కోచ్ తెలిపాడు. శిఖరాన్ని జయించిన తర్వాత, తెగ్‌బీర్ సింగ్ సగర్వంగా శిఖరం వద్ద భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ సవాలుతో కూడిన యాత్రలో అతని తండ్రి అతనితో పాటు ఉన్నారు.






