Mana Enadu: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జీ హాడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఫ్రాన్స్‌లో వీరి వివాహ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది మార్చిలో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ జంట, గతంలో జూన్ 10, 2024న చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో సన్నిహితుల మధ్య వివాహ పరిచయ వేడుకను జరుపుకుంది. తాజాగా అఫీషియల్‌గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు విషెస్ తెలుపుతున్నారు.
ఐదేళ్లుగా ప్రేమలో..
ఈ 33 ఏళ్ల ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేనియల్ నికోల్ వ్యాట్, జార్జి హాడ్జ్ గత ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. 2023లో వీరిద్దరూ సౌతాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తరువాత తమ బంధాన్ని స్వయంగా వెల్లడించారు. దీంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. మరోవైపు జార్జీ హాడ్జ్ CCAA బేస్‌కు చెందిన ఓమహిళా ఫుట్‌బాల్ జట్టుకు హెడ్‌గా ఉంది. లండన్‌లో FA లైసెన్స్‌డ్ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తోంది.
2010లో భారత్‌పై అరంగ్రేట్రం
డేనియల్ వ్యాట్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 112 వన్డేలు, 160 టీ20లు ఆడింది. టెస్టుల్లో 129 పరుగులు, వన్డేల్లో 1907 పరుగులు, టీ20ల్లో 2828 పరుగులు చేసింది. కాగా.. వన్డేలు, టీ20ల్లో రెండేసి సెంచరీలు చేసింది. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో 27 వికెట్లు, టీ20ల్లో 46 వికెట్లు పడగొట్టింది. ఈ ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ససెక్స్, సదరన్ వైపర్స్, సదరన్ బ్రేవ్ తరఫున కూడా ఆడింది. ఆల్ రౌండర్‌గా రాణిస్తోంది. కుడిచేతి వాటంతో బ్యాటింగ్, ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. 2010, మార్చి 1న ముంబైలో భారత్‌పై ఇంగ్లండ్‌లో అరంగేట్రం చేసింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ మహిళల జట్టులో వ్యాట్ సభ్యురాలు.








