ManaEnadu:నటుడు సిద్ధార్థ్, బాలీవుడ్ దివా అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకుంది. త్వరలోనే వీళ్ల వివాహం జరగనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ జంట ఇప్పటికే పలు ఫంక్షన్లు, ఈవెంట్లలో కలిసి కనిపిస్తుంటారు. అలాగే పార్టీలు, డేట్స్, డిన్నర్ లకు వెళ్తుంటారు. ఇక తాజాగా అదితిరావు హైదరీ మాట్లాడుతూ తన ప్రేమ, పెళ్లి విషయాలు షేర్ చేసుకుంది. మరి ఈ జంట ప్రేమకథ ఏంటో తెలుసుకుందామా..?
“సిద్ధార్థ్ నాకు ‘మహాసముద్రం (Maha Samudram)’ అనే సినిమా షూటింగులో పరిచయమయ్యాడు. ఆ షూటింగులోనే మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మార్చిలో నాకు సిద్ధార్థ్ (Siddharth) తన ప్రేమ గురించి చెప్పి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు మేం నిశ్చితార్థం చేసుకున్నాం. నిశ్చితార్థం జరిగిన దేవాలయంలోనే పెళ్లి చేసుకుంటాం. నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు.
ఓ రోజు నా వద్దకువచ్చి సిద్ధార్థ్ తనను ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. అలా ఈ ఏడాది మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. అక్కడికెళ్లాక.. సిద్ధార్థ్ మోకాళ్లపై కూర్చొని.. నాకు ప్రపోజ్ చేశాడు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం (Sri Ranganathaswamy Temple) మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. అందుకే మా నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం’’ అని అదితీ తన ముచ్చట్లు చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల ఇదే విషయం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తాము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారని.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. వెడ్డింగ్ డేట్ (Siddharth-Aditi Rao Hydari Marriage) గురించి మాట్లాడుతూ.. ఇదేమీ షూటింగ్ డేట్ కాదని లైఫ్‌టైమ్ డేట్ అని.. పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుందని తెలిపారు.






