
హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసులో దర్యాప్తును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈడీ ఈనెల 7న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
దానికిశోర్ నుంచి సమాచారం సేకరణ
తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటుచేసుకున్న ఉల్లంఘనలపై ఏసీబీ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఫిర్యాదుదారు ఎంఏయూడీ (పురపాలక శాఖ) ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి సమాచారం సేకరించింది. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
నిబంధనల ఉల్లంఘన
ఈ కేసులో కేటీఆర్ ఏ-1గా, అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏ-2గా, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ-3గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. దానికిశోర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో చోటుచేసుకున్న కీలక ఉల్లంఘనలు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. వీటి ఆధారంగానే ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారిని విచారించే అవకాశం కనిపిస్తోంది.
సంతకం చేయకుండానే కమిటీ ఏర్పాటు
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి, లండన్ ఎఫ్‌ఈవోల మధ్య 2022 జనవరిలోనే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అదే ఏడాది జులై 11న జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించిన ప్రస్తావన ఉన్నట్లు తేలింది. రేసు నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే… ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన నాటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తేలినట్లు అధికార వర్గాల సమాచారం.
ఉత్తర్వులు జారీ చేయకుండా
హైదరాబాద్‌లో 9, 10, 11, 12 సీజన్‌లలో ఫార్ములా-ఈ రేస్‌లను నిర్వహించేందుకు ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య 2022 అక్టోబరు 25న మొదటి ఒప్పందం కుదిరింది. దీన్ని కుదుర్చుకునే అప్పుడు, సీజన్-9 కోసం నిధులను ఖర్చు చేయడానికి అర్వింద్ కుమార్… ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదని సమాచారం. ప్రభుత్వమూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్లు తెలిసింది.