భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ‘మంచి లేదా చెడు పాక్‌తో మేము సత్సంబంధాలు కొనసాగిస్తాం’ అంటూ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక నెటిజన్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టగా.. దీన్ని నిఖిల్ తాజాగా ఎక్స్ వేదికగా షేర్ చేసి స్పందించారు.
వారి కోసం మీ డబ్బు ఖర్చుపెట్టడం మానండి
‘‘ఇంకా ఎవరైనా తుర్కియే వెళ్లాలనుకుంటున్నారా? దయచేసి ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. భారతీయులు ప్రతి ఏడాది తుర్కియేలో పెద్దమొత్తంలో ఖర్చు పెడుతుంటారు. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారి కోసం మీ డబ్బు ఖర్చుపెట్టడం దయచేసి మానండి’’ అని నిఖిల్ పేర్కొన్నారు.
పాక్కు తుర్కియే వత్తాసు
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను భారత్ చేపట్టగా.. ఆ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఎర్డోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ మృతులకు కనీసం నివాళి కూడా అర్పించలేదు.
ఇక్కడ తీవ్ర నిరసనలు
ఇక పాక్ ప్రయోగించిన క్షిపణుల్లో చాలావరకు తుర్కియేకు సంబంధించినవేనని తెలుస్తోంది. తుర్కియే ఆపదలో ఉన్నప్పుడు భారత్ ఆదుకుందని, కానీ ఆ కృతజ్ఞత లేకుండా యుద్ధ సమయంలో పాక్తో చేతులు కలిపింది. నేపథ్యంలోనే ఎర్డోగాన్ ప్రభుత్వం తీరుపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘బాయ్‌కాట్ తుర్కియే’ (Boycott Turkey) పేరుతో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.






