
బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వెనుక ఓ తెలుగు నటుడు కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నటుడు తరుణ్ రాజును అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా పోలీసుల కస్టడీకి ఇచ్చింది. రన్యారావు ఎక్కువగా తరుణ్ రాజ్( Tarun Raj)తోనే ఫోన్‌లో సంభాషించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అతణ్ని అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్నారు. తరుణ్ రాజ్ పరిచయం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
ఆమెతో మాకు సంబంధాల్లేవ్
ఇక ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ (Ranya Rao Smuggling Case) అధికారులు రన్యా రావు సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును సోమవారం రోజున విచారించారు. ఇప్పటికే ఆయన్ను బలవంతపు సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి పంపించి.. తాజా విచారణలో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకుంది. అయితే రన్యా రావుకు పెళ్లి చేసిన తర్వాత ఆమెతో సంబంధాలు తెగిపోయాయని, స్మగ్లింగ్ తో తమకు సంబంధం లేదని ఆయన విచారణలో తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఆమె భర్త జతిన్ హుక్కేరి కూడా రన్యారావుతో ఎలాంటి సంబంధాలు లేవన్నట్టుగా కోర్టుకు తెలిపినట్లు తెలిసింది.
ఇదీ జరిగింది
మార్చి 3వ తేదీన బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు డీఆర్ఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను అక్కడే అరెస్టు చేసిన అధికారులు అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేశారు. ఈ క్రమంలో రూ.3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు రన్యారావు వివాహ వేడుకకు వీఐపీలు హాజరై ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్లు గుర్తించారు. ఆమె పెళ్లి వీడియోను పరిశీలించిన అధికారులు ఆ వేడుకకు హాజరైన వీఐపీలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.