Mana Enadu : బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) గురించి తెలిసిన వారికి.. ఆయనకు ఫిట్ నెస్ పై ఉన్న మక్కువ గురించి కూడా తెలిసే ఉంటుంది. ప్రజెంట్ బీ టౌన్ లో ఫిట్టెస్ట్ హీరోల్లో టైగర్ ష్రాఫ్ కూడా ఒకడు. తాజాగా ఆయన ఫిట్ నెస్ కు తగ్గట్టు ఓ పదవీ వరించింది. ఖోఖో ప్రపంచ కప్ 2025 (Kho Kho World Cup 2025)కి కో బ్రాండ్ అంబాసిడర్ గా టైగర్ ష్రాఫ్ ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌ఐ) నియమించింది. జనవరి 13వ తేదీ నుంచి దిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ భారతదేశ ప్రతిష్టాత్మకమైన క్రీడపై ప్రపంచ క్రీడా ప్రేమికులకు అవగాహన కల్పిస్తుందని అసోసియేషన్ తన ప్రకటనలో పేర్కొంది.
ఫిట్ నెస్ పొందడానికి క్రీడలు గొప్ప మార్గం
ఇక ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన టైగర్ ష్రాఫ్ (Tiger Shroff Kho Kho Brand) ఖోఖో బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో క్రీడల పాత్రను టైగర్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్ నెస్ అనేది భాగం కావాలని చెప్పారు. ఫిట్ నెస్ పొందడానికి క్రీడలు గొప్ప మార్గం అని పేర్కొన్నారు. ఖోఖో అనేది ఫిట్‌నెస్.. స్ట్రాటజీ .. స్పిరిట్‌ల సంపూర్ణ సమ్మేళనం అని వివరించారు. ఖోఖో భారతీయ క్రీడ అని.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కాలని ఆశించారు. గొప్ప క్రీడను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు కేకేఎఫ్ఐకి ధన్యవాదాలు తెలిపారు.
24 దేశాలు.. 21 పురుషులు.. 20 మహిళల జట్లు
24 దేశాల నుంచి 21 పురుషులు.. 20 మహిళల జట్లతో వారం రోజుల పాటు ఖో-ఖో ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. ఐకానిక్ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం (Indira Gandhi Indore Stadium)లో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నందున ఖో-ఖో ప్రపంచ కప్ ఒక ప్రత్యేక ఈవెంట్‌గా రక్తి కట్టిస్తుందని, ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఖోఖో ప్రపంచ కప్‌నకు అనన్య పాండే (Ananya Pandey), సారా అలీ ఖాన్ , అభినవ్ బింద్రా తదితరులు ప్రచార సాయం అందిస్తున్నారు.








