Mana Enadu: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపే లక్ష్యంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత NDA, INDIA కూటములు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ మహారాష్ట్ర ఎన్నికలుగా చెప్పొచ్చు. అందుకే.. అక్కడ భారీ విజయం సాధించి.. ప్రజల మద్దతు తమకే ఉందని చాటిచెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
ముఖ్యంగా BJP, శివసేన, NCPతో కూడిన మహాయతి అదే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు.. పార్టీల్లో చీలికలతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించేందుకు కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), NCPల కూటమి మహావికాస్ అఘాడీ(Mahavikas Aghadi) ఉవ్విళ్లూరుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 75 స్థానాల్లో BJP, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది.
మరోసారి కుటుంబ పోరు
కాగా ఈసారి కోప్రీ-పచ్‌పఖాడీ నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే(CM Eknath Shinde) నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు షిండేపై ఉద్ధవ్ వర్గం నుంచి కేదార్ డిఘే(Kedar Dighe) పోటీ చేస్తున్నారు. బారామతి అసెంబ్లీ స్థానం నుంచి డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Deputy CM Ajit Pawar) నామినేషన్ వేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఇదే బారామతి నుంచి మాజీ సీఎం శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule), అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీ పడ్డారు. ఆ పోరులో సుప్రియ విజయం సాధించారు. ఇప్పుడు అజిత్ పవార్‌కు పోటీగా ఆయన తమ్ముడి కుమారుడు యుగేంద్ర పవార్‌ను బరిలోకి దింపారు. దీంతో బారామతి నియోజకవర్గం (Baramati Constituency) నుంచి మరోసారి కుటుంబ పోరుకు సిద్ధమైంది.
ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్
కాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. వీటిలో BJP, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా తలపడుతున్నవి 75 సీట్లలోనే. ఇవి కూడా విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్‌లలోనే అధికంగా ఉన్నాయి. ఒక్క విదర్భలోనే 47 చోట్ల BJPతో కాంగ్రెస్ తలపడుతోంది.
MVA కూటమితో పశ్చిమ మహారాష్ట్రలో 32 చోట్ల.. ఉత్తర మహారాష్ట్రలో 17 చోట్ల, మరాఠ్వాడాలో 19 చోట్ల, కొంకణ్‌లో 33 చోట్ల పోటీ పడుతున్నది. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ముఖ్యస్థానాలను టార్గెట్ చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..