జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్ ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలకు ఫుల్ స్టాప్ పెడుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ పౌరులెవరూ ఇండియాలో ఉండొద్దంటూ 48 గంటల్లో భారత్ ను విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అల్టిమేటర్ జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రాలకు అమిత్ షా ఫోన్
తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇదే విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వెంటనే పంపించేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అటారీ-వాఘా సరిహద్దు (attari wagah border) దగ్గరకు పెద్ద ఎత్తున పాకిస్థానీలు తరలివెళ్లారు.
పాకిస్థానీలను పంపేయండి
మరోవైపు అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. దేశవ్యాప్తంగా అధికారులంతా పాకిస్థానీయుల (Pakistanis in India) కోసం జల్లెడ పడుతున్నారు. వీలైనంత త్వరగా వారిని తమ దేశానికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం రోజున పహల్గామ్‌లో ఉగ్రమూకల దాడిలో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.






