ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్. త్వరలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల (AP SSC Results 2025)ను వెల్లడించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చని వెల్లడించారు. 9552300009 ఈ నంబరుకు వాట్సాప్ చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చని చెప్పారు.
ఆందోళన వద్దు
ఇక ఈ ఏడాది పదో తరగతి పరీక్షల (AP 10th Exams)కు 6,19,275 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 5,64,0 64 మంది, తెలుగు మీడియం వారు 51, 69 ఉన్నారని తెలిపింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దని పేర్కొంది.
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
మరోవైపు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కూడా కాకముందే ఇంటర్మీడియట్ ప్రవేశాల (AP Intermediate Admissions 2025) ప్రక్రియను రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మే 31వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియను జరగనుంది. ఫలితాలు ప్రకటించడానికి ముందే తాత్కాలిక ప్రవేశాల ప్రక్రియను చేపట్టిన అధికారులు.. పాస్ అవుతాననే ధీమా ఉన్న విద్యార్థులు కాలేజీలలో చేరడానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.






