నటి కల్పిక గణేశ్ (Kalpika Ganesh) చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ప్రిజం క్లబ్ వ్యవహారంలో కల్పికపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై మరో కేసు బుక్ అయ్యింది. ఇన్‌స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని పేర్కొంటూ కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆన్‌లైన్ వేదికగా కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. సంబంధిత ఆధారాలను పోలీసులకు అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రిజం పబ్లో గొడవ
హైదరాబాద్లోని ప్రముఖ ప్రిజం పబ్లో మేనేజర్తో గొడవ పడిన కల్పికపై క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కొద్దిరోజుల క్రితం కేసు బుక్ చేశారు. మే 29న క్లబ్‌కు వెళ్లిన కల్పిక రూ.2,200 బిల్ చేసి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరింది. కుదరదని మేనేజర్ చెప్పడంతో ఆయనతో గొడవకు దిగారని క్లబ్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ ఇతర సిబ్బంది తనపై అత్యాచారం, అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో నటి తప్పుడు ప్రచారం చేశారని కూడా ఆయన తెలిపారు. క్లబ్‌లోని సామగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కల్పికపై కేసు బుక్ చేశారు.






