
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ఫొటోలు మాత్రం మనసుపై చెరగని ముద్ర వేస్తుంటాయి. అలా తాజాగా నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు. వారు కేవలం రాజకీయ నాయకులే కాదు తోడల్లుళ్లుకూడా. స్వర్గీయ నందమూరి తారకరామారావు అళ్లుళ్లు.
30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై
వారే ఏపీ సీం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu), మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara rao). ఈ ఇద్దరు తోడల్లుళ్లుదాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి కనిపించారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఇవాళ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆత్మీయ ఆలింగనం
ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన అనంతరం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అక్కడున్న కెమెరామెన్ ఈ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలతో క్లిక్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.