ManaEnadu : రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఇక్కడ గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తాడని ఈ భవనాలు చూశాకే తెలిసింది. రాజులు కూడా ఇలాంటి నిర్మాణాలు చేయలేదు. ఈ భవనాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ (YS Jagan) మభ్యపెట్టారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అన్నారు.
బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు
గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఈరోజు పరిశీలించారు. అనంతరం అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్ టబ్ (Bath Tub) కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. ఈ భవనాలు దేనికి వాడుకోవాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారని విశాఖ (Visakha) ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఇక్కడేం జరిగిందో ప్రజలకు చెప్పాలి
“గతంలో నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇక్కడకు రావాలని ప్రయత్నించాం. కానీ ఎవరినీ రానీయకుండా చేశారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు చెప్పాలి. రుషికొండ బీచ్ (Rushikonda Beach) విశాఖలోనే అత్యంత అందమైన ప్రాంతం. చాలా దేశాలు తిరిగాను, ఎంతో మంది నేతలను చూశాను కానీ ఎవరూ ఇలాంటి ప్యాలెస్‌లు కట్టుకోలేదని తెలిపారు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా?” అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.