Mana Enadu : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం (Mahalxmi Scheme)లో భాగంగా వేల మంది మహిళలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకానికి వస్తున్న ఆదరణ చూసి ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలోనూ ఈ పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించాయి.
ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu) ఈ పథకం అమలుపై కసరత్తు మొదలు పెట్టారు. తాజాగా ఈ పథకంలో కీలక అడుగు ముందు పడింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం (AP Free Bus Scheme)పై మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ పథకాన్ని అధ్యయనం చేసి ఏపీకి సిఫార్సు చేయాలని మంత్రుల కమిటీకి సూచనలు చేసింది.
రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోంశాఖ మంత్రి అనితలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రుల కమిటీ కన్వీనర్‌గా రవాణాశాఖ ముఖ్యకార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ పథకంపై నిర్ణయం తీసుకునేందుకు వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించింది.






