Mana Enadu : బంగాళాఖాతంలో వెనువెంటనే ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల తమిళనాడు (Tamil Nadu Rains), ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో ఈ రెండు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. ఇక సోమవారం రోజున ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రెండ్రోజుల్లో మరింత బలపడి తమిళనాడు తీరంవైపు ప్రయాణించనుంది.
ఏపీలో భారీ వర్షాలు
మంగళ, బుధవారాల్లో తమిళనాడు, ఏపీ (AP Rains Alert)లోని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం వాయుగుండంగానూ రూపాంతరం చెంది.. అది తీరాన్ని తాకిన వెంటనే ఈ నెల 17న అండమాన్ (Andaman) పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోందని వెల్లడించింది.
వెనువెంట అల్పపీడనాలు అందుకే
మరోవైపు ఈశాన్య రుతు పవనాలు చురుకుగా కదులుతుండటం, థాయ్‌లాండ్ (Thailand) పరిసరాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పూర్వ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. దీనివల్ల వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఈ అల్పపీడనాల ప్రభావంతో ఈ నెల చివరి వరకు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (AP Rains Today) కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక సోమవారం రోజున ఏర్పడనున్న అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే.. చలి తీవ్రత కొంత తగ్గుతుందని వివరించారు.
చలిపులి పంజా
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల తమిళనాడు, ఏపీలో చలిపులి (AP Winter News) పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఏపీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు, అనంతపురం, విజయనగర, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో 18 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో అరకు, సాలూరు తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.








