
విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు జూన్ 1న నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలుత జులై 29వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు(Online Applications) స్వీకరించారు. ఆ తర్వాత దరఖాస్తుల గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన అధికారులు.. ఆ సమయం కూడా నేటితో ముగియనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెండు విడతల్లో ఎంట్రన్స్ పరీక్ష
దేశవ్యాప్తంగా 653 జేఎన్‌వీలలో ఉచిత, నాణ్యమైన విద్య(Free Education)ను అందించే ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అదనపు సమయం కల్పించారు. ఈ పొడిగింపు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను సులభంగా పూర్తి చేసేందుకు మరింత అవకాశం ఇస్తుంది. JNVST 2026 పరీక్ష రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్ష డిసెంబర్ 13న, రెండో విడత ఎగ్జామ్ ఏప్రిల్ 11, 2026న జరుగుతుంది. ఈ పరీక్షలో మానసిక సామర్థ్యం(Mental capacity), గణితం, భాషా నైపుణ్యాలను పరీక్షించే 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 100 మార్కులకు 2 గంటల వ్యవధిలో నిర్వహిస్తారు.
The last date to submit the online application for Class VI Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST) 2026 has been extended to August 27, 2025.
Visit the official website: https://t.co/nYNY5WpWt9 pic.twitter.com/va5xGA381C
— @jnvmalappuram (@jnvmalappuram) August 13, 2025
ఎలాంటి అర్హతలు ఉండాలంటే..
అర్హత కోసం విద్యార్థి 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. మే 1, 2014 నుంచి జులై 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు చేసే జిల్లాలోనే విద్యార్థి నివాసిగా ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో నవోదయ అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in ద్వారా చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలలో ఫొటో, సంతకం, ఆధార్ కార్డు, జన్మ ధ్రువీకరణ పత్రం, గ్రామీణ కోటా ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే) ఉన్నాయి. దరఖాస్తు రుసుము లేదు, ఇది గ్రామీణ విద్యార్థులకు సులభతరం చేస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విద్యార్థులను కోరారు.